రాముడు నడయాడిన నేల..పర్ణశాల .. పర్యాటక పుణ్యక్షేత్రం

రాముడు నడయాడిన నేల..పర్ణశాల .. పర్యాటక పుణ్యక్షేత్రం

తెలంగాణ అంటే చారిత్రక స్థలాలకే కాదు, కనువిందు చేసే ప్రకృతి ప్రదేశాలకూ ప్రసిద్ధి. పురాణకాలం నాటి ఆనవాళ్లు తెలిపే ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కంచర్ల గోపన్న కట్టించిన భద్రాద్రి దేవాలయం గురించి అందరికీ తెలుసు. దానికి దగ్గర్లోనే పర్ణశాల ఉంది. రామాయణకాలం నాటి ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయని స్థానికులు కథలుగా చెప్తారు

పర్ణశాల చూడాల్సిందే. ఎందుకంటే... రామాయణకాలంలో రాముడు.. సీత, లక్ష్మణులతో కలిసి కొంతకాలం ఇక్కడ ఉన్నారని  పురాణాలు చెబుతున్నాయి.  అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. వాళ్లు కట్టుకున్న కుటీరం, సీత, రామ, లక్ష్మణుల విగ్రహాలు, రావణాసురుడు సీతను అపహరించుకు వెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తాయి. రామాయణంలో పంచవటిగా పేరొందిన ప్రాంతం ఇదే అంటారు.

సీతమ్మ కథ

పర్ణశాలకు అతి దగ్గర్లో వాగు ఉంది. సీతాదేవి ఈ వాగులో స్నానం చేయడం వల్ల దీనికి పర్ణశాలకు చుట్టుపక్కల రామాయణ విశేషాలను తెలిపే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. రావణాసురుడు సీతను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఇక్కడున్న గుట్టపై రథాన్ని నిలిపాడట. అందుకే ఇక్కడున్న గుట్టను రథంగుట్ట అని పిలుస్తారు. మొక్కలు, చెట్లు, చిన్నచిన్న రాళ్లతో ఈ గుట్ట ఆకుపచ్చని వనంతా కనిపిస్తుంది. అలాగే ఇక్కడున్న ఊరుకు దుమ్ముగూడెం అనే పేరు రావడం వెనుక పౌరాణిక కథ ఉంది. రాముడు కొంతమంది రాక్షసులను చంపి, వారిని ఇక్కడే దహనం చేయడం వల్ల, ఆ బూడిదంతా ఈ ప్రాంతాన్ని కమ్మేసిందట. అందుకే దీనిని దుమ్ముగూడెం అని పిలుస్తున్నామని చెప్తారు. ఇక్కడున్న గోదావరి నది ఒడ్డున గుండాలు ఉన్నాయి. వీటిలో వేడినీళ్లు ఉంటాయని భక్తులు నమ్ముతారు. దీనికీ ఓ కథ ఉంది. సీతస్నానం చేయడానికి వేడి నీళ్లు అడిగితే.. రాముడు భూమిలోకి బాణంవేసి వేడి నీళ్లు తెప్పించాడట...సీతమ్మవాగు అనే పేరొచ్చిందని చెప్తారు.

ఈ ప్రాంతంలోనే  కొన్ని రంగురంగుల రాళ్లు కూడా కనిపిస్తాయి. ఎందుకు రంగుల్లో ఉన్నాయని అడిగితే... సీతమ్మ స్నానం చేసేటప్పుడు పసుపు... కుంకుమకోసం ఈ రాళ్లను వాడేదని.. అందుకే ఈ రాళ్లు ఇంత శోభాయమానంగా ఉన్నాయని స్థానికులు చెప్తారు. అలాగే సీతాదేవి స్నానం చేసిన తర్వాత నారచీరలను ఇక్కడి రాళ్లపై ఆరవేసిందని.. ఆ ఆనవాళ్లు రాళ్లపై ఉన్నాయని వాటి జాడలను చూపిస్తారు. రాముడు బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుడిని వధించింది కూడా ఈ ప్రాంతంలోనే. ఇక్కడ పెద్ద గుంట ఉంది. రావణుడి రూపాన్ని చూసి స్పృహతప్పి పడిపోయిన సీతను రావణుడు మట్టితో సహా పెకిలించుకు పోవడం వల్ల ఆ గుంట ఏర్పడిందట.

అందం.. ఆనందం

పర్ణశాలలో సీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది. ఈ స్వామికి నిత్యపూజలు జరుగుతుంటాయి. శ్రీరామనవమి, ముక్కోటి.. లాంటి పండుగలు నిర్వహిస్తారు. ఉత్సవాలు చేస్తారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడం, పక్కనే గోదావరి ప్రవహించడం, రామాయణానికి సంబంధించిన అనేక విశేషాలు ఉండటం వల్ల టూరిస్టులు ఈ ప్రదేశానికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ బోటు షికారు ప్రత్యేక ఆకర్షణ. పర్ణశాలకు వచ్చిన వాళ్లు స్వామిని దర్శించుకుని, చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాల్లో తిరిగి రాత్రిళ్లు ఇక్కడ బస చేయకుండా వెళ్లరు. ఒకవైపు భక్తులకు ముక్తిని ప్రసాదించే సీతారాముల కథా విశేషాలు, మరోవైపు ప్రకృతి రమణీయతను పంచే సుందర ప్రదేశాలు టూరిస్టులకు పర్ణశాలలో కనులపండుగ చేస్తున్నాయి.

ఎలా వెళ్లాలంటే..

పర్ణశాల భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని, దుమ్ముగూడెం మండలంలో ఉంది. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి బస్సులు ఉన్నాయి. మండల కేంద్రమైన దుమ్ముగూడెంకు పర్ణశాల 12కి.మీ., అలాగే భద్రాచలానికి 36 కి.మీ. దూరంలో ఉంది పర్ణశాల. భద్రాచలం నుంచి రోడ్డు లేదా బోటు మార్గంలో ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు.